తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి వ్యూహాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి ఇచ్చిన మద్దతును స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమరావతి, పోలవరం ప్రాజెక్టుల అభివృద్ధి కొనసాగుతోందని, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ప్రాధాన్యత లభిస్తోందని పురందేశ్వరి తెలిపారు.









