దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అలంపూర్ క్షేత్ర ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని పర్యాటకులకు పరిచయం చేసేలా సౌండ్ అండ్ లైట్ షో అందుబాటులోకి వచ్చింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సాయంత్రం అలంపూర్ ఆలయ ప్రాంగణంలో ఈ మల్టీమీడియా సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించారు. వెలుగు, ధ్వని సాంకేతికతల సమ్మేళనంతో ఆలయ చరిత్ర, విశిష్టతను ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించేలా దీనిని రూపొందించారు.
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకం కింద రూ.4.60 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అలంపూర్ క్షేత్రానికి ఉన్న పురాతన చరిత్ర, ఆలయాల నిర్మాణ శైలి, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఆధునిక సాంకేతికతతో సందర్శకులకు వివరించేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పర్యాటకులకు కూడా కొత్త అనుభూతి కలగనుంది.
అలంపూర్‌లో సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభంతో ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన అలంపూర్‌కు ఈ కొత్త ఆకర్షణ అదనపు ప్రత్యేకతగా నిలవనుంది. స్థానికంగా పర్యాటక కార్యకలాపాలు పెరగడంతో పాటు ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.









