ములుగు జిల్లాలోని పాలంపేటలో ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని జర్మనీకి చెందిన పర్యాటకులు సందర్శించారు. ఆదివారం జర్మనీ దేశస్తులు కేబ్లిజ్ యంగ్, యులి స్టేయింబ్, చీకో స్ట్రాన్ లు రామప్ప ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ జర్మనీ పర్యాటకులకు రామప్ప ఆలయ చరిత్ర, నిర్మాణ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆలయ శిల్ప సంపదను ఆసక్తిగా తిలకించిన జర్మనీ పర్యాటకులు.. ‘బ్యూటిఫుల్ టెంపుల్ రామప్ప’ అంటూ ప్రశంసించారు. ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు తెలిపారు.
అనంతరం జర్మనీ పర్యాటకులు రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఈవో ఇమ్మడి భాస్కర్‌తో పాటు టూరిస్ట్ పోలీసులు, దేవాదాయ, పురావస్తు, పర్యాటక శాఖల సిబ్బంది వారికి అవసరమైన సహకారం అందించారు. విదేశీ పర్యాటకుల రాకతో రామప్ప ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రత్యేకత మరోసారి చర్చనీయాంశంగా మారింది.









