ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజ్ మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్‌ను ఆత్మీయంగా కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. అనంతరం బ్రదర్ సిరాజ్ మాట్లాడుతూ.. గతంలో వక్ఫ్ బోర్డు చైర్మన్లుగా పనిచేసిన పలువురు ఈ పదవిని హోదాగా భావించారే తప్ప బాధ్యతగా భావించలేదని అన్నారు.
మొట్టమొదటిసారిగా అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని ఒక బాధ్యతగా స్వీకరించి పనిచేస్తున్నారని సిరాజ్ ప్రశంసించారు. వక్ఫ్ బోర్డు ద్వారా సమాజానికి ఎంతగా సేవ చేయవచ్చో తన కార్యాచరణతో అబ్దుల్ అజీజ్ నిరూపిస్తున్నారని కొనియాడారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధితో పాటు వక్ఫ్ సంస్థలను బలోపేతం చేసేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.
చైర్మన్ పదవి కేవలం హోదా కోసం కాదని.. సమాజం పట్ల ఉన్న బాధ్యతను నెరవేర్చేందుకు ఇచ్చిన అవకాశం అని అబ్దుల్ అజీజ్ తన పనితీరు ద్వారా నిరూపిస్తున్నారని బ్రదర్ సిరాజ్ అన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, వాటి సమర్థవంతమైన వినియోగం కోసం మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్‌కు తన అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.









