హిమాలయ విపత్తులపై ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి.. సద్గురు ప్రతిపాదన

హిమాలయ ప్రాంతంలో తరచూ సంభవించే ప్రాణాంతక ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్, చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్ దేశాలతో కలిసి ‘ప్రత్యేక హిమాలయ బోర్డు’ ఏర్పాటు చేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రతిపాదించారు. రాజకీయ సరిహద్దులను పక్కనపెట్టి హిమాలయాల పర్యావరణ పరిరక్షణ కోసం ఈ దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

హిమాలయ ప్రాంతంలో పర్యావరణ మార్పులు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సద్గురు పేర్కొన్నారు. విపత్తులను ఎదుర్కోవడంతో పాటు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, పర్యావరణ పరిరక్షణ, సహాయక చర్యల్లో పరస్పర సహకారం పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హిమాలయాల పరిరక్షణ బాధ్యత ఒక్క దేశానిదే కాదని, ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న అన్ని దేశాలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.

ఇదిలా ఉండగా నేపాల్‌లో వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు సద్గురు తన వంతు సహాయం ప్రకటించారు. ఖాట్మండులో జరిగిన ఓ కార్యక్రమంలో నేపాల్ వరద బాధితుల సహాయ కార్యక్రమాల కోసం రూ.కోటి విరాళం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు