బంగారం, వెండి ధరలకు బ్రేక్.. కొత్త వారంలో స్థిరంగా పసిడి రేట్లు

గత కొన్ని వారాలుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బంగారం, వెండి ధరలు కొత్త వారం ప్రారంభంలో కాస్త స్థిరపడ్డాయి. ఆగస్టులో రికార్డు స్థాయిలో పరుగులు తీసిన పసిడి ధరలు గత వారం చివర్లో భారీగా పతనమైన విషయం తెలిసిందే. సోమవారం దేశీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు పెద్దగా మార్పు లేకుండా కొనసాగుతుండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర వారం క్రితం ఔన్సుకు 4,650 డాలర్ల మార్కును దాటగా.. ప్రస్తుతం సుమారు 4,440 డాలర్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు సిల్వర్ ధర ఔన్సుకు 66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ఇటీవల రికార్డు స్థాయికి చేరిన విలువైన లోహాల ధరలు కాస్త చల్లబడినట్లు కనిపిస్తోంది.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలపై ఛైర్మన్ కెవిన్ వార్ష్ చేసిన సంకేతాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఫెడ్ నిర్ణయాల నేపథ్యంలో డాలర్, అమెరికా బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరగడంతో.. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి కొంత తగ్గినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో ఫెడ్ నిర్ణయాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు