-ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు
-హైడ్రా ప్రజావాణికి 49 వినతులు
-వెనువెంటనే పరిష్కారానికి హైడ్రా చర్యలు…
నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములు, రహదారులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ప్రజా ఆస్తులను, జలవనరులను పరిరక్షించాలని, అనధికార నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం, గోధుమకుంట గ్రామంలోని గోకరకుంట కబ్జాకు గురౌతోంది. గ్రామ రికార్డుల మేరకు ఈ కుంట విస్తీర్ణం 14.30 ఎకరాలు కాగా.. హెచ్ ఎం డీ ఏ ప్రకటించింది కేవలం 4.30 గుంటలు మాత్రమే. క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు.. శాటిలైట్ ఇమేజ్‌లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల ఆధారంగా 14.30 ఎకరాల చెరువును కాపాడాలని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ చెరువుకు ఆనుకుని ఉన్న భూ యజమానులు చెరువును కూడా కబ్జా చేసేసి లే ఔట్లు వేయడం, క్రీడామైదానంగా వినియోగిస్తున్నారంటూ ఫిర్యాదులు వెళ్లువెత్తాయి
వెంటనే చెరువు వాస్తవ హద్దులు నిర్ధారించాలని కోరారు. యిలా సోమవారం హైడ్రా ప్రజావానికి 49 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను హైడ్రా అడిషనల్ కమిషనర్ డి. ఆనందకుమార్ పరిశీలించి,.వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పజెప్పారు.

ఫిర్యాదులు యిలా….
కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో గతంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ తో పాటు.. వరద కాలువను కబ్జా చేసి షట్టర్లు వేసి కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. సెప్టిక్ ట్యాంక్ స్థలం వినియోగంలో లేనందున పార్కుగానో మరే ఇతర ప్రజావసరాలకు వినియోగించాలి కాని.. ఒకరిద్దరు దీనిని కబ్జా చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ తగదని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అలాగే ఈ సెప్టిక్ ట్యాంకుకు ఆనుకుని వరద కాలువ ఉంటే దానిని కూడా కబ్జా చేసేసి షట్టర్లు వేస్తున్నారని వీటిని అడ్డుకోవాలని కోరారు.
రామచంద్రాపురం, రాయసముద్రం సరస్సును ఆనుకుని, బీరంగూడ కమాన్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ / బీహెచ్ఈఎల్ భూమిలో అనధికార ఆక్రమణలు, నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. సరస్సు చుట్టూ ఉన్న బహిరంగ ప్రదేశంలో కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలు ఆపాలని కోరారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను కోరారు.
అదే విధంగా మల్లాపూర్‌లోని శక్తి సాయి నగర్ ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్డుపై నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికుల ఫిర్యాదు. ప్రజా రహదారిని ఆక్రమించడం వల్ల రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డును క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు…
ఇది ఇలా ఉంటే చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి చెందిన భూములు ఆక్రమణకు గురయ్యాయని భక్తులు, ఆలయ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. మొత్తం 2211 గజాల దేవాలయ భూమిలో కొంతభాగం ఆక్రమణకు గురైనట్లు మూడు సర్వే నివేదికలు పేర్కొన్నాయని తెలిపారు. కలెక్టర్, హిమాయత్‌నగర్ మండల సర్వేయర్, దేవాదాయ శాఖ నిర్వహించిన సర్వేల ఆధారంగా ఆలయ భూములను గుర్తించి, ఆక్రమణలను తొలగించాలని కోరారు.
Post Views: 22









