ఇంట్లో రోజూ రోటీలు, చపాతీలు చేసుకునే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో అవి గట్టిపడటం ఒకటి. పెనం మీద నుంచి తీసినప్పుడు మెత్తగా, బాగా పొంగిన రోటీలు కొన్ని గంటల తర్వాత పొడిగా, గట్టిగా మారిపోతుంటాయి. ముఖ్యంగా ఉదయం తయారు చేసి లంచ్ బాక్స్‌లో పెట్టిన రోటీలు మధ్యాహ్నానికి మెత్తదనం కోల్పోతాయి. అయితే దీనికి పిండి లేదా నీటి నాణ్యత మాత్రమే కారణం కాదు. రోటీలను తయారు చేసిన తర్వాత ఎలా నిల్వ చేస్తున్నామన్నది కూడా చాలా కీలకం.
చాలామంది పెనం నుంచి తీసిన వెంటనే వేడి వేడి రోటీలను గాలి చొరబడని డబ్బాలో పెట్టి మూత పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల లోపల ఆవిరి చిక్కుకుపోయి, చల్లబడిన తర్వాత నీటి బిందువులుగా మారుతుంది. దీంతో ముఖ్యంగా కింద ఉన్న రోటీలు ఎక్కువ తేమను పీల్చుకుని జిగురుగా లేదా తడిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పెనం నుంచి తీసిన రోటీలను వెంటనే బాక్స్‌లో పెట్టకుండా 30 నుంచి 60 సెకన్ల పాటు ప్లేట్‌పై ఉంచడం మంచిది. ఇలా చేస్తే అదనపు ఆవిరి బయటకు వెళ్లిపోతుంది.
రోటీలను లంచ్ బాక్స్‌లో పెట్టే ముందు శుభ్రమైన కాటన్ క్లాత్‌లో చుట్టడం కూడా మంచి చిట్కా. ఈ క్లాత్ అదనపు తేమను పీల్చుకుని రోటీలపై నీరు చేరకుండా సహాయపడుతుంది. అలాగే టిఫిన్ బాక్స్ అడుగున శుభ్రమైన క్లాత్ లేదా టిష్యూ ఉంచితే కింది రోటీలు తడిసిపోకుండా ఉంటాయి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే రోటీలు ఎక్కువసేపు మెత్తగా, రుచిగా ఉండేలా చూసుకోవచ్చు.









