మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సేవలను, ఆయన ప్రజా సంక్షేమానికి చేసిన కృషిని ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
డాక్టర్ వైఎస్సార్ ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి పనిచేసిన మహానేత అని ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ కొనియాడారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలిచిన వైఎస్సార్‌ను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ.. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.









