ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరగొచ్చు : సీఎం రేవంత్పై కొండా సురేఖ ఫైర్…
‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు నిజంగా హ్యాపీగా ఉన్నారా ? మీరు హ్యాపీగా లేరనే విషయం మీకు తెలుసు.. నాకు తెలుసు. గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి’’ అంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈరోజు నాకు ఎదురైంది.. రేపు మీకూ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా బయటకు రండి. మీ మనసులో ఉన్న బాధను బయటకు చెప్పుకోండి’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు కొండా సురేఖ పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాలనలో ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతూ,. నియోజకవర్గ ప్రజలకు పనులు చేయలేకపోతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని సూచించారు.
ఇదిలా ఉంటే,‘‘సమయం దొరకదు.. సమయం దొరికినా ఫైల్ తీసుకోరు.. ఫైల్ తీసుకున్నా సంతకం పెట్టరు.. సంతకం పెట్టినా పని కాదు. ఆ తర్వాత ఆ ఫైల్ ఎటు పోతుందో తెలియదు’’ అంటూ ప్రభుత్వంలో పరిస్థితిని కొండా సురేఖ తీవ్రంగా విమర్శించారు.
ప్రజాప్రతినిధులు పనులు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలి ? ఎవరిని కలవాలి? ఏం చేయాలి ? అనే పరిస్థితి ఉందన్నారు. ఈ వ్యవ స్థను ప్రభుత్వం వెంటనే స్ట్రీమ్లైన్ చేయకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై ప్రభుత్వం ఒకసారి సర్వే చేయించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా వెంటవెంటనే అమలు చేస్తే ప్రజల్లో అసంతృప్తిని తగ్గించవచ్చని ప్రభుత్వానికి సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కొండా సురేఖ పరోక్షంగా సీఎం పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘తాను ఏం చేసినా నడుస్తుందనే విధంగా మోనోపోలీ పద్ధతిలో వెళ్లడం కరెక్ట్ కాదు’’ అని వ్యాఖ్యానించారు.పార్టీ నిర్ణయాలకు అతీతంగా తనకు తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవడం సరైన పద్ధతి కాదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. పార్టీ వ్యవస్థ, నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఒక వేదికపై ఎమ్మెల్యే అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం కూడా కరెక్ట్ కాదని తప్పుబట్టారు. అభ్యర్థుల విషయంలో పార్టీకి ఒక విధానం, నిర్ణయ ప్రక్రియ ఉంటుందని గుర్తుచేసేలా వ్యాఖ్యలు చేశారు సురేఖ.
యాదాద్రి దేవస్థానం పాలకమండలి ఏర్పాటు విషయంలో తనతో చర్చించకపోవడం వల్ల ఎంత వివాదం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కీలక నిర్ణయాల్లో సంబంధిత వ్యక్తులను సంప్రదించకుండా ముందుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కొండా సురేఖ.
అదేవిధంగా, తమ దగ్గర తప్పులు పెట్టుకుని ఎదుటివారిని వేలెత్తి చూపితే.. మనవైపు నాలుగు వేళ్లు చూపిస్తాయనే విషయాన్ని ముఖ్యమంత్రి మర్చిపోయినట్లున్నారు’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు, ప్రజాప్రతినిధులకు పనులు కాకపోవడం, హామీల అమలులో జాప్యం వంటి అంశాలను కొండా సురేఖ ప్రధానంగా ప్రస్తావించారు. పరిస్థితిని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు మీ మనసులో ఉన్న బాధను బయటకు చెప్పండి. ఈరోజు నాకు ఎదురైన పరిస్థితి రేపు మీకూ రావచ్చు’’ అంటూ మరోసారి ప్రజాప్రతినిధులకు కొండా సురేఖ పిలుపునిచ్చారు…









