Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
ఢిల్లీ పర్యావరణ మంత్రితో డా. కడవెండి వేణుగోపాల్ సమావేశం
న్యూఢిల్లీ, 03 సెప్టెంబర్ 2026:
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం కేంద్రంగా పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న Eco-Club Environmental Society వ్యవస్థాపక అధ్యక్షులు డా. కడవెండి వేణుగోపాల్ ఢిల్లీ ప్రభుత్వ గౌరవ మంత్రి శ్రీ సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా గారిని కలిసి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ రహిత ఢిల్లీ నిర్మాణం తదితర అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డా. వేణుగోపాల్ మాట్లాడుతూ, భారతదేశంలో పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాహనాల పెరుగుదల, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఘన వ్యర్థాల సమస్య వంటి కారణాలతో పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యం మరియు జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న ముఖ్యమైన పర్యావరణ సమస్యగా మారిందని తెలిపారు. ఢిల్లీలో కణ కాలుష్యం (PM10, PM2.5) ప్రత్యేక ఆందోళనగా ఉందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంటోంది.
“దేశ రాజధాని ఢిల్లీ పర్యావరణ పరిరక్షణలో ఒక ఆదర్శ నగరంగా నిలవాలి. ఢిల్లీలో విజయవంతంగా అమలు చేసే కార్యక్రమాలను దేశంలోని ఇతర నగరాలు, రాష్ట్రాల్లో కూడా విస్తరించవచ్చు” అని డా. వేణుగోపాల్ పేర్కొన్నారు.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, కచరా వేరు చేయడం, బాధ్యతాయుతమైన వ్యర్థ నిర్వహణ, చెట్ల సంరక్షణ, పచ్చదనం పెంపు, వాయు కాలుష్యంపై అవగాహన, నీటి సంరక్షణ, పర్యావరణ విద్య వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని ఆయన కోరారు.
ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మరియు యువతను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేసి, వారిని “పర్యావరణ రాయబారులు”గా తీర్చిదిద్దాలని సూచించారు.
Eco-Club Environmental Society తరఫున ఢిల్లీ ప్రభుత్వం, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర భాగస్వాములతో కలిసి ప్లాస్టిక్ రహిత మరియు హరిత ఢిల్లీ కోసం ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డా. వేణుగోపాల్ తెలిపారు.
“ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు పర్యావరణహితమైన భారత్ను నిర్మించగలం” అని ఆయన అన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ గౌరవ మంత్రి శ్రీ సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా గారి మార్గదర్శకత్వం, సహకారం మరియు ప్రోత్సాహం కోరినట్లు డా. వేణుగోపాల్ తెలిపారు.









