విజయవాడ మేయర్ పీఠంపై రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థకు మేయర్‌గా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కోరినట్లు సమాచారం. గురువారం సచివాలయానికి తన కుమారుడు సిద్ధార్థతో కలిసి వెళ్లిన బోండా ఉమా.. సీఎం చంద్రబాబును కలిసి మేయర్ అభ్యర్థిత్వంపై ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సిద్ధార్థ బయోడేటాను చంద్రబాబుకు అందజేసిన బోండా ఉమా.. మేయర్ పదవికి తన కుమారుడికి ఉన్న అర్హతలు, సామర్థ్యాలను వివరించినట్లు తెలుస్తోంది. విజయవాడ నగర మేయర్ పదవిని సమర్థంగా నిర్వహించే అన్ని అర్హతలు సిద్ధార్థకు ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లోనూ సిద్ధార్థకు మంచి పరిచయాలు ఉన్నాయని, పార్టీ కార్యకర్తలు, యువతతో నిరంతరం మమేకమవుతూ రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారని వివరించినట్లు తెలిసింది.
విజయవాడకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాధాన్యత, నగరంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తదితర అంశాలను కూడా బోండా ఉమా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని పరిశీలించి మేయర్ పదవికి అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. దీంతో విజయవాడ మేయర్ పీఠం కోసం సిద్ధార్థ పేరును తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.









