కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి, విద్యా సంస్థల నిర్మాణ పనులను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి, అక్కడ నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను కూడా పరిశీలించనున్నారు. పనుల పురోగతి, నాణ్యత తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సీఎం సందర్శించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు దౌల్తాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌కు చేరుకుని.. నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమీక్షలో విద్య, మౌలిక వసతులు, సంక్షేమం తదితర రంగాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించే అవకాశం ఉంది. సమీక్ష అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్‌కు చేరుకుని అక్కడే రాత్రి బస చేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని మరిన్ని ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు