ప్రజా పాలన కాదు.. 1000 రోజుల ప్రజా పీడన..
కాంగ్రెస్ పాలనలో సింగరేణి విధ్వంసం: టి బి జి కె యస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ…
Today9TV News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు: కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదని, 1000 రోజుల ప్రజా పీడన అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ విమర్శించారు. శనివారం ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్-2 వద్ద ఏరియా టిబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కాపు కృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సింగరేణి సంస్థలో పురోగతి కంటే విధ్వంసం, వినాశనమే కనిపిస్తోందని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని ఆయన ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాలనలో సింగరేణి సంస్థ ఉత్పత్తి, అమ్మకాలు, లాభాలు, బోనస్లు, కార్మిక సంక్షేమం వంటి అనేక రంగాల్లో చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు. కార్మికులు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని చూశారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిన సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నెలకు మూడు మెడికల్ బోర్డులు నిర్వహించి 100 శాతం ఇన్వాలిడేషన్ చేస్తామని, బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, కార్మికులకు సొంతింటి పథకం కింద 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందిస్తామని, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కల్పిస్తామని హామీలు ఇచ్చారని అన్నారు.
అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, కార్మికుల నోట్లో మన్ను కొట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కార్మికులు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో నల్ల నేలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని కాపు కృష్ణ అన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సింగరేణి కార్మికుల సమస్యలపై ఆయన పలు డిమాండ్లను ప్రభుత్వ, యాజమాన్యాల ముందుంచారు.
నెలలో మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలి.
100 శాతం ఇన్వాలిడేషన్ అమలు చేయాలి.
సింగరేణికి రావాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి.
తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి.
150 మస్టర్ల నిబంధనను ఎత్తివేయాలి.
కార్మికుల డిస్మిస్లను నిలిపివేయాలి.
సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి.
బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలి.
అలవెన్స్లపై విధించే ఆదాయపు పన్నును యాజమాన్యమే భరించాలి.
మైనింగ్, E&M, EP ఆపరేటర్లకు సర్ఫేస్లో అదే ఉద్యోగాన్ని కల్పించాలి.
మారుపేర్ల సమస్యను పరిష్కరించాలి.
ప్లే డేలో N-1, PHDలో 50 శాతం విధానాన్ని ఎత్తివేయాలి.
కొత్త అండర్గ్రౌండ్ గనులను ప్రారంభించాలి.
ఖాళీల ఆధారంగా ప్రమోషన్లు కల్పించాలి.
ఇంటర్నల్ క్లరికల్ పరీక్ష నిర్వహించాలి.
కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం, ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర రావు, సెంట్రల్ బ్రాంచ్ నాయకులు జంగం రాజ్ కుమార్, మునిగేల నాగేశ్వరరావు, సుద్దాల సంపత్ కుమార్, మురళీకృష్ణ, బద్దుల ప్రవీణ్, కమటం పరమేశ్, సాంబార్ రాజశేఖర్, పి.కె. నాగరాజు, చిరుత వెంకటేశ్వర్లు, పడ్డం శ్రీనివాస్, గూగులోత్ రమేష్ నాయక్, కోన వెంకటేష్, సర్వే నరేష్, తక్కీ, కటారి ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు కుర్రీ నాగేశ్వరరావు, ఎడ్ల శ్రీనివాస్, ఆవుల నరశింహరావు, తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు గేట్ మీటింగ్కు హాజరయ్యారు.









