9/11 ఉగ్రదాడులకు సంబంధించిన పాత వీడియో ఫుటేజ్ తాజాగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అమెరికాపై అల్‌ఖైదా జరిపిన ఈ దాడుల వెనుక ఉన్న సంబంధాలపై దశాబ్దాలుగా అనుమానాలు కొనసాగుతుండగా.. సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన మాజీ నిందితుడు ఒమర్ అల్-బయూమీ, అల్‌ఖైదా అగ్రనేత అన్వర్ అల్-అవ్లాకీతో కలిసి ఉన్న దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫుటేజ్ 9/11 బాధిత కుటుంబాలు సౌదీ ప్రభుత్వంపై దాఖలు చేసిన భారీ నష్టపరిహారం కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒమర్ అల్-బయూమీ 1994లో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు సౌదీ అరేబియా నుంచి శాన్ డియాగోకు వచ్చినట్లు సమాచారం. అయితే అక్కడ చదువును పక్కనపెట్టి మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడని కథనాలు చెబుతున్నాయి. తాజాగా బయటపడిన 1997-98 నాటి వీడియోల్లో బయూమీ, అన్వర్ అల్-అవ్లాకీతో పాటు సౌదీ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారితో కలిసి మిలిటరీ తరహా ‘పెయింట్ బాట్లింగ్’ కార్యక్రమంలో పాల్గొంటూ కనిపించారు.
ఈ వీడియోల్లో బయూమీ, అవ్లాకీ ఆప్యాయంగా కౌగిలించుకోవడం, సౌదీ అధికారులతో బయూమీ సమావేశాలు నిర్వహించడం వంటి దృశ్యాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో FBI దర్యాప్తులో ఈ కార్యకలాపాలపై పలు అనుమానాలు వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో తాజాగా వెలుగులోకి వచ్చిన ఫుటేజ్ 9/11 దాడులకు సంబంధించిన పాత అనుమానాలు, సౌదీ సంబంధాలపై మరోసారి చర్చకు దారితీస్తోంది.









