విదేశాల్లో ఉద్యోగాలు, వీసాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ రమానందన (నందూస్ వరల్డ్) ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గతంలో జారీ చేసిన లుకౌట్ నోటీసుల ఆధారంగా శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఆమెకు పోలీసులు 41A నోటీసులు జారీ చేయగా, మంగళవారం న్యాయవాదులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు అధికారులు ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించగా, పలు కీలక అంశాలపై దాటవేత సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో దర్యాప్తునకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఈ నెల 16వ తేదీన మళ్లీ విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.
పోలీసుల ఎదుట నందన తన వాదనను గట్టిగా వినిపించారు. తాను కేవలం ఐటీ ఉద్యోగిని, కంటెంట్ క్రియేటర్ని మాత్రమేనని.. ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ నిర్వహణకు, ఆర్థిక లావాదేవీలకు తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని తేల్చిచెప్పారు. వ్యాపార వ్యవహారాలన్నీ పూర్తిగా తన భర్త జాగర్లమూడి మధుకరే చూసుకుంటారని, ఆ సంస్థలో తాను ఎలాంటి అధికారిక హోదాలోనూ లేనని ఆమె విచారణలో స్పష్టం చేశారు. అయితే బాధితుల ఫిర్యాదుల్లో నందనతో పాటు ఆమె భర్త, మామగారి పేర్లు కూడా ఉండటం, నకిలీ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ (CoS) పత్రాలు ఇచ్చి లక్షలాది రూపాయలు వసూలు చేశారన్న తీవ్ర ఆరోపణలు ఉండటంతో పోలీసుల దృష్టి ఇప్పుడు వీరి కుటుంబ ఆర్థిక మూలాలపై కేంద్రీకృతమైంది.
నందన పూర్తి బాధ్యతను తన భర్తపైకి నెట్టడంతో, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మధుకర్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు వేగంగా బిగుస్తోంది. పిల్లల సంరక్షణ చూస్తున్న తన భర్త త్వరలోనే భారత్కు వచ్చి దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని ఆమె పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం నందనతో పాటు ఆమె భర్త బ్యాంకు ఖాతాల వివరాలను, జరిగిన భారీ నగదు లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్న దర్యాప్తు బృందం.. ఈ అంతర్జాతీయ వీసా నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందుకు తెచ్చేందుకు లోతైన కసరత్తు చేస్తోంది.









