“టీడీపీలోకి వైసీపీ నుంచి భారీ చేరికలు”: చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకున్న బొత్స మేనల్లుడు చిన్న శ్రీను.. ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో ప్రకంపనలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్వయానా మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తన కుమార్తె సిరి సహస్రతో కలిసి పచ్చ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొని వారికి సాదర స్వాగతం పలికారు.

పార్టీ మారిన అనంతరం చిన్న శ్రీను మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడై తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలోనే సాధ్యమని విశ్వసించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగస్వామి కావాలని భావించానని, రాజకీయాల కంటే ప్రాంతీయ ప్రగతే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.

ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చిన్న శ్రీను సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ముఖ్య నేతలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే భారీ ఎత్తున చేరికలు ఉంటాయని బాంబు పేల్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు, తాను పార్టీ మారడానికి గల అంతర్గత కారణాలు, రాజకీయ పరిస్థితులపై తన సొంత జిల్లా విజయనగరం వెళ్లిన తర్వాత పూర్తి ఆధారాలతో వివరాలు వెల్లడిస్తానని ప్రకటించడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు