పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల మధ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. సౌదీ పౌర నివాసాలు, ప్రధాన ఆర్థిక కేంద్రాలు, చమురు ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని హౌతీలు మంగళవారం భారీ ఎత్తున బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో మెరుపు దాడులకు తెగబడ్డారు. ముఖ్యంగా యెమెన్-సౌదీ సరిహద్దుల్లోని అల్-వాదియా సరిహద్దు క్రాసింగ్ సమీపంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలిస్తున్న సౌదీ సైనిక కాన్వాయ్‌పై స్థానికంగా తయారుచేసిన ఫ్రాగ్మెంటేషన్ బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు. క్షిపణి నేరుగా వాహనాలను తాకడంతో భారీ పేలుళ్లు సంభవించి, ఆకాశమంత ఎత్తున దట్టమైన మంటలు, పొగలు అలుముకున్న దృశ్యాలతో కూడిన వీడియోను హౌతీ మిలిటరీ మీడియా అధికారికంగా విడుదల చేసింది.
నాలుగేళ్ల పాటు కొనసాగిన కాల్పుల విరమణ ముగిసిన తర్వాత హౌతీలు జరిపిన అత్యంత తీవ్రమైన దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. సరిహద్దుల్లో సైనిక ట్రక్కులను ధ్వంసం చేయడమే కాకుండా, సౌదీ దక్షిణ ప్రావిన్స్‌లోని నాలుగు ప్రధాన నగరాలు, విమానాశ్రయం మరియు ఆరాంకో ఆయిల్ రిఫైనరీ కేంద్రాలపై ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ అర్ధరాత్రి దాడుల ధాటికి చమురు శుద్ధి కేంద్రాల్లోని పలు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోగా, దాదాపు 73 మందికి పైగా గాయపడినట్లు సౌదీ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. యెమెన్‌లో సౌదీ అనుకూల ప్రభుత్వ దళాలు భూభాగాల స్వాధీనానికి చర్యలు చేపట్టడం, జైలుపై సౌదీ వైమానిక దాడుల్లో 11 మంది మరణించారన్న ఆరోపణల నేపథ్యంలోనే హౌతీలు ఈ ప్రతీకార దాడులకు దిగినట్లు తెలుస్తోంది.
ఈ వరుస క్షిపణి దాడులపై సౌదీ అరేబియా తీవ్రస్థాయిలో స్పందించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని, పౌరుల భద్రతను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని, హౌతీల చర్యలకు తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని సౌదీ విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఎర్రసముద్రంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై వేధింపులతో పాటు ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే అన్ని రకాల దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ హౌతీల దాడితో సౌదీ చమురు ఉత్పత్తి కేంద్రాలకు అంతరాయం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.









