టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఫోర్జరీ కేసుల విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టీకరణ!

టీవీ9 వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో వి. రవిప్రకాశ్‌కు భారత సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCPL) యాజమాన్య హక్కుల వివాదంలో ఆయనపై నమోదైన ఫోర్జరీ, మోసం, కుట్ర ఆరోపణలకు సంబంధించిన రెండు క్రిమినల్ కేసులను పునరుద్ధరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ రవిప్రకాశ్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఈ వివాదం 2018లో ఏబీసీపీఎల్‌లో అలందా మీడియా సంస్థ 90.54 శాతం వాటాను కొనుగోలు చేసిన సమయంలో ప్రారంభమైంది. కొత్త యాజమాన్యాన్ని అడ్డుకునేందుకు నటుడు శివాజీకి రూ. 20 లక్షలకు 40 వేల షేర్లను విక్రయించినట్లు రవిప్రకాశ్ తప్పుడు ఒప్పంద పత్రాలు సృష్టించారని, కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్వోసీ వద్ద తప్పుడు రాజీనామా పత్రాలు అప్‌లోడ్ చేశారని అలందా మీడియా ప్రతినిధి పి. కౌశిక్ రావు 2019లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు రెండు వేర్వేరు ఫిర్యాదులు చేశారు. వీటి ఆధారంగా కూకట్‌పల్లి కోర్టులో ఆయనపై రెండు క్రిమినల్ కేసులు నమోదై విచారణకు వచ్చాయి.

ఈ కేసుల నుంచి రవిప్రకాశ్‌ను తప్పించేందుకు గతంలో ప్రభుత్వం జీవో జారీ చేయగా, కూకట్‌పల్లి కోర్టు కేసుల ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. అయితే దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుడ్డిగా వ్యవహరించారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కేసులను పునరుద్ధరించింది. హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో, ట్రయల్ కోర్టులో రవిప్రకాశ్ విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు