మెగా డీఎస్సీ నిర్వహణపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి తీరుతామని, చేతనైతే తనను ఆపాలని జగన్కు బహిరంగ సవాల్ విసిరారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న ప్రాథమిక తేడా కూడా తెలియకుండా మాజీ సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేకపోయారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే పెట్టి 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేసిందని స్పష్టం చేస్తూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు దాదాపు 300 కేసులు వేసినా న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఎక్కడా తప్పుపట్టలేదని లోకేశ్ గుర్తుచేశారు. సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ వేసిన పిల్ ను కూడా హైకోర్టు కొట్టివేసిందని, విపక్షాలు చేస్తున్న నిరాధార ఆరోపణలకు తమ విద్యాశాఖ అధికారులు ఇప్పటికే మీడియా ముఖంగా స్పష్టమైన వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టినా చివరికి క్లీన్చిట్ వచ్చిందని గుర్తుచేసిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తూ, దాడులకు పాల్పడుతున్న ‘సాక్షి’ విలేకరులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
యువగళం పాదయాత్రలో నిరుద్యోగ యువత పడుతున్న బాధలను స్వయంగా చూశానని, అందుకే ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహించాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం 3,000 చొప్పున ఐదేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో మొత్తం 30,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను తాము తీసుకుంటున్నామని ప్రకటించారు. నిరుద్యోగులు ఎలాంటి రాజకీయ దుష్ప్రచారాలను నమ్మవద్దని, త్వరలోనే విడుదల కానున్న తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్కు కష్టపడి ప్రిపేర్ అయి విజయం సాధించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని లోకేశ్ పిలుపునిచ్చారు.









