తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి తొలి కీలక ముందడుగు పడింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బహదూర్‌గూడలో భారీ ‘ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్’ (సమీకృత రవాణా కేంద్రం) ఏర్పాటు చేసేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు ప్రారంభించింది. మొత్తం 796.28 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు శరవేగంగా పట్టాలెక్కాయి. శంషాబాద్-తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డును ఆనుకుని ఉండేలా ఈ మెగా హబ్‌కు రూపకల్పన చేశారు.
ఈ బహదూర్‌గూడ మెగా హబ్ కేంద్రంగా హైదరాబాద్ నుంచి మూడు ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, అలాగే అమరావతి మీదుగా చెన్నై మార్గాల్లో ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్ల కార్యకలాపాలు సాగనున్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత చేరువలో ఉండటం, ఓఆర్ఆర్ అనుసంధానం ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన సానుకూలతగా మారింది. భవిష్యత్‌లో విమాన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే సులభంగా బుల్లెట్ రైలు ఎక్కేలా మల్టీమోడల్ కనెక్టివిటీని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రయాణ సమయం కేవలం 2 గంటలకే పరిమితం కానుంది.
ఈ సమీకృత మొబిలిటీ హబ్‌ను కేవలం బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌కే పరిమితం చేయకుండా.. విమాన, హైస్పీడ్ రైలు, ప్రతిపాదిత మెట్రో మరియు రోడ్డు రవాణా వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్ టెర్మినల్‌ను కూడా ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైన, అత్యాధునిక మల్టీమోడల్ రవాణా మరియు వాణిజ్య హబ్‌గా శంషాబాద్-తుక్కుగూడ ప్రాంతం సరికొత్త రూపుదిద్దుకోనుండటంతో హైదరాబాద్ అంతర్జాతీయ రవాణా ముఖచిత్రంలో మరో మైలురాయిని చేరుకోనుంది.









