స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల కీలక నిర్ణయం: రఘువీరారెడ్డి చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు.. గరిష్ఠ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. స్థానిక పోరులో పార్టీ అభ్యర్థులను సమర్థవంతంగా బరిలోకి దించి విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు 8 మంది సీనియర్ నేతలతో కూడిన ‘రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ’ని ఆమె అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ అత్యున్నత కమిటీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మానిటరింగ్ కమిటీలో రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రులకు పెద్దపీట వేశారు. కమిటీ కన్వీనర్‌గా మాజీ కేంద్ర మంత్రి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం వ్యవహరించనుండగా.. సభ్యులుగా సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రులు ఎం.ఎం. పల్లంరాజు, కిల్లి కృపారాణి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, సీనియర్ నేత తులసిరెడ్డిని నియమించారు. వీరితో పాటు ఎన్నికల సమన్వయం, సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలను నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్ఠ సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకునేలా పక్కా క్షేత్రస్థాయి ప్రణాళికలు రచించాలని మానిటరింగ్ కమిటీకి వైఎస్ షర్మిల స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధివిధానాల రూపకల్పన, గెలుపు గుర్రాలైన బలమైన అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు మరియు క్షేత్రస్థాయి వివాదాల పరిష్కారం వంటి కీలక అంశాలన్నీ ఈ కమిటీ పర్యవేక్షణలోనే సాగుతాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మానిటరింగ్ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పార్టీ కేడర్‌ను ఎన్నికల సమరానికి సమాయత్తం చేయాలని ఆమె ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు