ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల సమర్థవంతమైన నియంత్రణే పరమ లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా ఎస్పీలు, కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ‘త్రిశూల్’ పేరుతో బహుముఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ‘జీరో డ్రగ్స్, మహిళలపై వేధింపుల పట్ల జీరో టాలరెన్స్, జీరో రోడ్డు ప్రమాదాలు’ అనే మూడు ప్రధాన ఆశయాలతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ‘త్రిశూల్’ కమిటీలను ఏర్పాటు చేసి పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలపై జరిగే వ్యవస్థీకృత అసభ్య పోస్టులు, వేధింపులను ఏమాత్రం ఉపేక్షించకుండా ఉక్కుపాదం మోపాలని, సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాకు 30 మంది సాంకేతిక నిపుణులైన కానిస్టేబుళ్లను కేటాయించామని తెలిపారు.
రాష్ట్రంలో గంజాయి సహా అన్ని రకాల మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక క్యాలెండర్ను రూపొందించి ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వ్యసన విముక్తి కోసం విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాల్లో అత్యాధునిక డీ-అడిక్షన్ సెంటర్లను వెంటనే అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. మరోవైపు, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో జరిగే ప్రతి రోడ్డు ప్రమాదాన్ని సమగ్రంగా ఆడిట్ చేసి, మూల కారణాలను విశ్లేషించి ప్రమాద రహిత రహదారులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు తేల్చిచెప్పారు.
గత రెండేళ్లలో రాష్ట్రంలో సమష్టి కృషితో మొత్తం నేరాల రేటు 14 శాతం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 29.2 శాతం మేర తగ్గాయని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం 47 శాతంగా ఉన్న నేరస్తులకు శిక్షల ఖరారు రేటును (కన్విక్షన్ రేటు) మరింత గణనీయంగా పెంచాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఎక్కడైనా నేరం జరిగిన సమాచారం అందిన 30 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవాలని, కేసుల దర్యాప్తు, కోర్టు ప్రక్రియలను వేగవంతం చేసేందుకు వీలుగా ‘వన్ కోర్టు-వన్ కానిస్టేబుల్’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.









