ప్రఖ్యాత తమిళ పండితుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ ‘పట్టిమండ్రం’ (చర్చా వేదిక) నిర్వాహకుడు మరియు నటుడు ప్రొఫెసర్ సోలమన్ పప్పయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, మధురైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల వయసులో ఆయన మరణించడంతో యావత్ తమిళ సాహిత్య లోకంతో పాటు సినీ రంగంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
సోలమన్ పప్పయ్య మృతి పట్ల తమిళ సూపర్స్టార్ రజనీకాంత్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రజనీకాంత్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా వేదికగా స్పందిస్తూ.. గొప్ప తమిళ జ్ఞాని, విద్యావేత్త అయిన ప్రొఫెసర్ సోలమన్ పప్పయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కేవలం అకడమిక్ వర్గాలు, విద్యావంతులకే మాత్రమే పరిమితమైన కఠినమైన తమిళ సాహిత్య చర్చలను, పట్టిమండ్రం వేదికల ద్వారా అతి సామాన్యులకు సైతం అర్థమయ్యే తేలికపాటి భాషలో ప్రజల ముంగిటకు చేర్చిన ఘనత పప్పయ్యదేనని రజనీకాంత్ ఘనంగా కొనియాడారు.
తన సుదీర్ఘ ప్రస్థానంలో సోలమన్ పప్పయ్య ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 12 వేలకు పైగా పట్టిమండ్రం చర్చా వేదికలకు విజయవంతంగా వ్యాఖ్యాతగా వ్యవహరించి రికార్డు సృష్టించారు. తన హాస్య చతురత, అనూహ్య వాగ్ధాటితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. పలు విజయవంతమైన తమిళ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన ఆల్టైమ్ బ్లాక్బస్టర్ మూవీ ‘శివాజీ-ది బాస్’తో పాటు ‘బాయ్స్’ చిత్రంలోనూ కీలక పాత్రలో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.









