తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాధురి రాథోడ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్పై లోతుగా విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, అతనికి ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టులో విచారణ సందర్భంగా ఈశ్వర్ సాయి తరఫు న్యాయవాది నాగూర్ బాబు తీవ్ర వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారుగా ఉన్న మాధురి రాథోడ్ వివాహితుడైన వ్యక్తితో సంబంధం కొనసాగించిన నేపథ్యాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం సోషల్ మీడియా, పబ్లిసిటీ మరియు ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడానికే తీవ్రమైన నిరాధార ఆరోపణలతో ఈ తప్పుడు కేసును బనాయించారని న్యాయస్థానానికి వివరించారు.
ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు, సమర్పించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆమోదించింది. ఎలాంటి నిర్బంధ చర్యలు చేపట్టవద్దని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఈశ్వర్ సాయికి ఈ కేసులో చట్టపరంగా పెద్ద ఊరట లభించినట్లయింది.









