తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించినప్పుడు ₹16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా ఏర్పడిందంటే, ఆ ఘనత పూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ముందుచూపుదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఉమ్మడి ఏపీలో చెన్నారెడ్డి, విజయభాస్కర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి దిగ్గజ ముఖ్యమంత్రులందరూ రాష్ట్ర ఖజానా బాధ్యతలను ఆర్యవైశ్యులకే అప్పగించారని, రోశయ్య సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసి ఏకంగా 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారని రేవంత్ గుర్తుచేశారు.
శాసనమండలి సభ్యుడిగా ఉన్న రోజుల్లో రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా భావోద్వేగంగా నెమరువేసుకున్నారు. తాను సభలో దూకుడుగా మాట్లాడినప్పుడు రోశయ్య తనను దగ్గరకు పిలిచి కోపాన్ని అదుపులో ఉంచుకుని అనుభవంతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావని హితవు పలికారని వెల్లడించారు. రోశయ్య ఎన్నడూ కఠిన పదజాలంతో మాట్లాడలేదని, తన చతురత, వాగ్ధాటితోనే పదునైన వ్యాఖ్యలు చేసేవారని కొనియాడారు. నాలుగు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ వచ్చి నగరంతో పేగుబంధం ఏర్పరచుకున్న ఆయన మాటకు విలువిచ్చే నగరంలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని సమర్థించారు.
ఆర్యవైశ్యులు సౌమ్యులని, వారి రక్తంలోనే ఆత్మగౌరవం, విజ్ఞత, ముందుచూపు ఉంటాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. జాతిపిత మహాత్మా గాంధీ, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు ఈ సమాజం నుంచే వచ్చారని గుర్తుచేశారు. ఎంతోమంది పేదరికంలో ఉన్నప్పటికీ, ఆత్మగౌరవంతో జీవిస్తూ ప్రభుత్వం నుంచి గుర్తింపును ఆశించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఈ ఆత్మగౌరవ భవనం పేద ఆర్యవైశ్యుల అవసరాలను తీర్చే వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తూ, భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.









