2029 నాటికి అర్హులందరికీ సొంతిల్లు: గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని డెడ్‌లైన్!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నిరుపేద కుటుంబానికి 2029 నాటికి శాశ్వత గృహాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘హౌసింగ్ ఫర్ ఆల్’ పథకాన్ని సాచురేషన్ పద్ధతిలో అమలు చేయాలని స్పష్టం చేస్తూ, ఇందులో భాగంగా 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు విధించారు. పీఎంఏవై గ్రామీణ్, పీఎం జన్ మన్ కింద మంజూరైన ఇళ్లను వచ్చే నెలలోనే గ్రౌండింగ్ చేయాలని, పట్టణాల్లో 1.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

రాష్ట్రంలో ఇంటి స్థలాలు లేని అర్హులైన పేదలను గుర్తించేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆవాస్ ప్లస్, రెవెన్యూ, హౌసింగ్ శాఖలతో పాటు ఆర్టీజీఎస్ డేటాను అనుసంధానం చేసి ఎక్కడా డూప్లికేషన్ లేకుండా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా ప్రాథమిక జాబితాలను ప్రదర్శించి, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిష్పక్షపాతంగా పరిష్కరించిన తర్వాతే తుది జాబితాను ఖరారు చేయాలన్నారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో సాచురేషన్ పద్ధతిలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పారిశ్రామిక టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు. శ్రీసిటీ వంటి ప్రముఖ పారిశ్రామిక కేంద్రాల్లో వీటిని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయని, ఈ దిశగా ఏపీఐఐసీతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే 2027 డిసెంబరు నాటికి మరో 75 వేల కొత్త ఇళ్లు మంజూరయ్యేలా చూడటంతో పాటు, అదనంగా 1.5 లక్షల ఇళ్లను పైప్‌లైన్‌లో ఉంచేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు