ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ: హైదరాబాద్ చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణపై చర్చ.. గ్లోబల్ సమ్మిట్‌కు సాదర ఆహ్వానం!

భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరానికి విచ్చేసిన షియా ఇస్మాయిలీల ప్రస్తుత ఇమామ్ ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-5తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చారిత్రాత్మక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భేటీ అయ్యారు. భాగ్యనగర విశిష్ట చారిత్రక వారసత్వ సంపదను పదిలంగా కాపాడుకోవడంతో పాటు సమగ్ర అభివృద్ధిని సాధించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ పరివాహక ప్రాంతంలోని ప్రాచీన నిర్మాణాలైన సిటీ కాలేజ్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ ప్రాజెక్టులలో అగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ భాగస్వామ్యం కావాలని, అందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయ సహకారాలను అందించాలని ముఖ్యమంత్రి కోరారు.

ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి పాత చారిత్రక భవనాన్ని హైదరాబాద్ నగరానికే గర్వకారణమైన ఒక గొప్ప హెరిటేజ్ సంపదగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రాచీన కట్టడాలను వాటి పూర్వ వైభవం చెక్కుచెదరకుండా కాపాడటంలో అగా ఖాన్ ఫౌండేషన్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అపార అనుభవం హైదరాబాద్ నగర పునర్నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కుతుబ్‌షాహీ సమాధుల వంటి చారిత్రక కట్టడాల పరిరక్షణలో ఫౌండేషన్ చూపిన అద్భుత పనితీరును సీఎం ప్రత్యేకంగా కొనియాడారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా రాబోయే డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు. ఈ మెగా సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు, వారసత్వ సంపద పరిరక్షణకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ సానుకూలంగా స్పందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు