హైడ్రా, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్…

హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట 40 ఎకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి, హైడ్రాకు సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేయడంలో ప్రభుత్వం ఏకంగా 219 రోజుల సుదీర్ఘ జాప్యం చేయడంతో, జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. దీంతో ఆ 40 ఎకరాల స్థలం శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకే చెందుతుందంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థించబడినట్లయింది.

సికింద్రాబాద్ లోతుకుంట సర్వే నంబర్ 1, 2 పరిధిలోని సుమారు 40 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా ప్రభుత్వం, శాంతా శ్రీరామ్ సంస్థ మధ్య యాజమాన్య హక్కుల వివాదం కొనసాగుతోంది. ఈ భూమి తమదేనని సంస్థ వాదించగా, అది కంటోన్మెంట్ ప్రభుత్వ భూమి అంటూ అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలోనే హైకోర్టు ఆ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, హైడ్రా (HYDRAA) అధికారులు అక్కడ కూల్చివేతలు చేపట్టడం పెను దుమారానికి దారితీసింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉండగానే నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ అధికారుల వైఖరిపై హైకోర్టు సింగిల్ జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసి మరొక సమర్థవంతమైన అధికారిని నియమించాలని ప్రధాన కార్యదర్శిని హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే ఆ ఉత్తర్వులపై రంగనాథ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో లోతుకుంట 40 ఎకరాల వివాదంలో ప్రైవేటు సంస్థకే పూర్తి అనుకూలత లభించినట్లయింది. మరోవైపు పిటిషన్ సాంకేతిక కారణాలతోనే డిస్మిస్ అయిందని, పూర్తి రికార్డులు పరిశీలించి తదుపరి న్యాయపరమైన కార్యాచరణ నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు