భారత్‌లో బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని డుమ్మా….

బంగ్లాదేశ్ నూతన ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీఎన్పీ అధినేత తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనపై సందిగ్ధత కొనసాగుతోంది. న్యూఢిల్లీ వేదికగా భారత్ ఆతిథ్యమిచ్చిన బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు బిమ్‌స్టెక్ (BIMSTEC) అధ్యక్షుడి హోదాలో ఆయనకు ఆహ్వానం అందినప్పటికీ హాజరుకాలేదు. అయితే, తన రెండో అధికారిక విదేశీ పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశానికి (UNGA) ఆయన హాజరవుతారని బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే భారత పర్యటనకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు ఆహ్వానం పంపినప్పటికీ, ఇప్పటివరకు ఆ పర్యటన తేదీలపై ఢాకా నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

బ్రిక్స్ సదస్సుకు ప్రధాని రెహ్మాన్ గైర్హాజరు కావడంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. బహుళపక్ష వేదికల ద్వారా కాకుండా, భారత్‌తో అనుకూల వాతావరణంలో నేరుగా ద్వైపాక్షిక చర్చలు జరిపి సంబంధాలను పునర్నిర్మించుకోవడానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని బంగ్లా విదేశాంగ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ తెలిపారు. గత 15 ఏళ్ల నాటి పాత విధానాలకు స్వస్తి పలికి న్యూఢిల్లీతో సరికొత్త దౌత్య సంబంధాలను ప్రారంభించడమే తమ లక్ష్యమని, ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన సమయంలోనే ప్రత్యేక ద్వైపాక్షిక పర్యటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

న్యూయార్క్‌లో జరిగే ఐరాస సర్వసభ్య సమావేశంలో బంగ్లాదేశ్ భవిష్యత్ కార్యాచరణను తారిఖ్ రెహ్మాన్ ప్రపంచ దేశాల ముందుంచనున్నారు. ముఖ్యంగా తీవ్ర సమస్యగా మారిన రోహింగ్యా శరణార్థుల సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలు దేశాల అధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. కాగా, సెప్టెంబర్ 8న ప్రారంభమైన ఐరాస 81వ సర్వసభ్య సమావేశానికి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహ్మాన్ అధ్యక్షత వహిస్తుండటం విశేషం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు