విదేశీ ఉద్యోగాల మోసం కేసు: పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్ నందన.. తనకేం సంబంధం లేదంటూ 3 గంటల విచారణలో వెల్లడి!

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేశారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ రామ నందన పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఆమె విచారణకు హాజరుకాగా పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. వాస్తవానికి సెప్టెంబర్ 16వ తేదీలోగా విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా, గడువు కంటే ఒకరోజు ముందే ఆమె తన న్యాయవాదులతో కలిసి స్టేషన్‌కు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.

దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు నందనపై సుమారు 20 కీలక ప్రశ్నలు సంధించారు. అయితే విదేశీ ఉద్యోగాల కన్సల్టెన్సీకి సంబంధించిన సమస్త వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను తన భర్త మాత్రమే పర్యవేక్షించేవారని, వాటితో తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ఆమె పోలీసుల ఎదుట స్పష్టం చేసినట్లు తెలిసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని హామీ ఇస్తూ, తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) నోటీసులను రద్దు చేయాలని ఆమె కోరగా, ఆ విజ్ఞప్తిని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నందన, ఆమె భర్త భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి దంపతులిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఏపీ పోలీసులు వారిపై ఎల్‌ఓసీ జారీ చేశారు. ఇటీవల ఆమె బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించగా, తాజాగా పూర్తిస్థాయి విచారణను ఎదుర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు