ఉద్యోగులకు తీపి కబురు!!
ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు.. కేంద్ర కేబినెట్ చారిత్రక నిర్ణయం…
రేపటి నుండే అమలులోకి!
`
Sept 16` TODAY9…
దేశంలోని కోట్ల మంది ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బుధవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల తప్పనిసరి కనీస వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.15,000 నుంచి రూ.25,000 కు పెంచుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త నిబంధన విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 (గురువారం) నుంచే అమలులోకి రానుంది.
కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా అదనంగా మరో 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు నేరుగా ఈపీఎఫ్ఓ తప్పనిసరి కవరేజీ పరిధిలోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేతన పరిమితి పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వంపై ఏటా రూ.11,339 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని మంత్రి వివరించారు
12 ఏళ్ల తర్వాత సవరణ…
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం వేతన పరిమితిని సవరించడం దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 2014లో అప్పటి యుపిఎ ప్రభుత్వం ఈ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచింది. ఆ తర్వాత మారిన జీవన వ్యయం, పెరిగిన వేతనాల స్థాయికి అనుగుణంగా ఈ సీలింగ్ను పెంచాలంటూ కార్మిక సంఘాలు, ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు సైతం ఈ పరిమితిని సమీక్షించాలని కేంద్రానికి సూచించడంతో ప్రభుత్వం వేగంగా కసరత్తు పూర్తి చేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది
ఉద్యోగులకు చేకూరే ప్రయోజనాలివే..
ప్రస్తుత నిబంధనల ప్రకారం బేసిక్ జీతం రూ.15,000 లోపు ఉన్నవారే ఆటోమేటిక్గా పీఎఫ్ పరిధిలోకి వచ్చేవారు. ఇప్పుడు ఈ పరిమితిని రూ.25,000కు పెంచడం వల్ల, రూ.25 వేల లోపు బేసిక్ వేతనం ఉన్న ప్రైవేట్ ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పీఎఫ్ పొదుపు ఖాతా అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ఉద్యోగుల నెలవారీ పీఎఫ్ చందాతో పాటు యాజమాన్యాల వాటా కూడా పెరుగుతుంది. ఫలితంగా పదవీ విరమణ (రిటైర్మెంట్) సమయానికి ఉద్యోగుల చేతికి భారీ మొత్తంలో నిధి దక్కుతుంది. దీంతో పాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద రిటైర్మెంట్ తర్వాత వచ్చే నెలవారీ పెన్షన్ కూడా గణనీయంగా పెరగనుంది. అలాగే ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద లభించే ఉచిత డెత్ ఇన్సూరెన్స్ పరిమితి కూడా ఈ పెంపుతో మరింత పెరగనుండటం విశేషం









