ఆంధ్రప్రదేశ్లో యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న మొత్తం 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (SLPRB) వేర్వేరుగా అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ నియామక ప్రక్రియ ద్వారా నిరుద్యోగులకు ప్రభుత్వ సర్వీసుల్లో చేరేందుకు మరో కీలక అవకాశం లభించింది.
ఈ నోటిఫికేషన్ల ప్రకారం మొత్తం 378 సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై), 1,569 కానిస్టేబుల్ కేటగిరీ పోస్టులతో పాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్సై విభాగంలో సివిల్, ఏఆర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండగా.. కానిస్టేబుల్ విభాగంలో సివిల్, ఏఆర్, ఫైర్మెన్, జైలు వార్డర్లు, కమ్యూనికేషన్స్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు కేవలం ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఎంపిక ప్రక్రియ ప్రాథమిక రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షలు, తుది రాతపరీక్షల ఆధారంగా పారదర్శకంగా సాగనుంది.
మరోవైపు, విడుదలైన నోటిఫికేషన్పై డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటే కేవలం 1,569 కానిస్టేబుల్ పోస్టులు మాత్రమే కేటాయించడం చాలా తక్కువని, ఇది తీవ్ర నిరాశకు గురిచేసిందని మండిపడింది. అధికారంలోకి రాకముందు యువతకు ఇచ్చిన హామీలకు కట్టుబడి తక్షణమే కానిస్టేబుల్ ఖాళీల సంఖ్యను భారీగా పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోస్టుల పెంపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని డీవైఎఫ్ఐ నేతలు హెచ్చరించారు.









