ఉక్రెయిన్‌లో ఘోరం: ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్ దాడి.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు!

యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌లోని దక్షిణ ప్రాంతంలో ప్రయాణికుల బస్సుపై రష్యా బలగాలు జరిపిన భీకర డ్రోన్ దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ద్నిప్రొపెట్రోవ్స్క్ ప్రాంతంలోని నికోపోల్ నగరం సమీపంలో సాధారణ పౌరులతో ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని డ్రోన్ ఢీకొన్నట్లు స్థానిక ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ హాంజా అధికారికంగా ధ్రువీకరించారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

బస్సుపై జరిగిన ఈ ఘాతుకంతో పాటు మైకోలైవ్ ప్రాంతంలో ప్రయాణికుల రైలుపై కూడా దాడి జరిగినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే దాడికి ముందే స్పందించిన భద్రతా సిబ్బంది, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. రవాణా వ్యవస్థలనే టార్గెట్ చేస్తూ పౌర రవాణా వాహనాలపై దాడులు తీవ్రతరం కావడం స్థానికంగా పెను భయాందోళనలను రేకెత్తిస్తోంది.

నిరాయుధులైన అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా క్రూరత్వాన్ని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని, ఆ దేశంపై మరింత కఠినమైన ఆర్థిక, దౌత్య ఆంక్షలు విధించాలని ఆయన ప్రపంచ దేశాలకు గట్టిగా విజ్ఞప్తి చేశారు. యుద్ధంలో పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని ఇరు దేశాలు పైకి చెబుతున్నప్పటికీ, వరుసగా జరుగుతున్న ఇలాంటి దాడులు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు