తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్ పరిసర ప్రాంతాల్లోని భూములపై ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. ఎర్రవల్లితో పాటు సమీపంలోని వెంకటపూర్, వరదరాజపూర్ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ముఖ్యంగా సర్వే నంబర్ 325లోని అసైన్డ్ భూముల కేటాయింపులు, కొనుగోళ్లు, ఇతర వినియోగాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఆక్రమణలు జరిగాయా అనే కోణంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అధికారులు భూముల కొలతలు వేస్తుండగా స్థానిక రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా తమ సాగు భూముల్లోకి ఎలా వస్తారంటూ అధికారులను నిలదీశారు. ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూములపై సర్వే పేరిట భయాందోళనలు సృష్టిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నామని అధికారులు రైతులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అన్నదాతల నిరసనలు, ప్రతిఘటనల మధ్య ఈ భూ పరిశీలన అంశం కొనసాగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో రేవంత్ వ్యాఖ్యల తర్వాత నేరుగా కేసీఆర్ ఫామ్హౌస్ సమీప భూములపైనే సర్వే చేపట్టడం కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య సరికొత్త రాజకీయ దుమారానికి దారితీస్తోంది.









