ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) ఫీజు వివాదంపై హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మొత్తాన్ని యథాతథంగా చెల్లించి, గడువులోగా లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మద్యం దుకాణ యజమానులను ఆదేశించింది. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబర్ 21వ తేదీ ఆఖరి గడువు కావడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఓపెన్ కేటగిరీ మద్యం షాపులకు, కల్లుగీత కేటగిరీ దుకాణాలకు మధ్య రెన్యూవల్ ఎక్సైజ్ ట్యాక్స్ (RET) విధింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ గుంటూరుకు చెందిన పలువురు వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వార్షిక ఆదాయంలో ఏకంగా 38 శాతం మేర ఫీజుగా వసూలు చేస్తున్నారంటూ సంబంధిత జీవోలను రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే లైసెన్స్ పునరుద్ధరణ అనేది పూర్తిగా స్వచ్ఛందమైన వ్యవహారమని, ఎవరిపైనా బలవంతం లేదని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. అంతేకాకుండా 38 శాతం ఫీజు అనేది వార్షిక ఆదాయంపై కాదని, గతంలో చెల్లించిన లైసెన్స్ ఫీజులో 38 శాతం మాత్రమేనని కోర్టుకు స్పష్టతనిచ్చారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫై చేసిన ఫీజునే వ్యాపారులు చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈ రెన్యూవల్ ఫీజు మొత్తం ఈ పిటిషన్పై వెలువడే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ విచారణ అనంతరం పిటిషనర్లు విజయం సాధిస్తే, వారు ఇప్పుడు అదనంగా చెల్లించిన మొత్తాన్ని భవిష్యత్తు లావాదేవీల్లో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం తరఫున ఏజీ హామీ ఇవ్వడంతో.. ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.









