యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులకు తెగబడటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. రియాద్లోని సున్నితమైన ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపాన్ని టార్గెట్ చేస్తూ హౌతీలు విరుచుకుపడగా, సౌదీ రక్షణ వ్యవస్థ ఆ క్షిపణులను గగనతలంలోనే విజయవంతంగా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా మారాయని, పరిణామాలు ఎప్పుడైనా తీవ్రరూపం దాల్చవచ్చని పేర్కొంటూ అమెరికా విదేశాంగ శాఖ (స్టేట్ డిపార్ట్మెంట్) తన పౌరులకు అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమాసియా దేశాల్లో ప్రస్తుతం నివసిస్తున్న, అలాగే ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే అమెరికన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. సైనిక ఘర్షణల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడం, గగనతలాల మూసివేత వంటి తీవ్ర ప్రయాణ అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తమ పర్యటనలను పునఃపరిశీలించుకోవాలని సూచించింది. ఎయిర్లైన్స్, విమానాశ్రయాల నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని నిరంతరం గమనిస్తూ ముందస్తు ప్రణాళికలతో ఉండాలని స్పష్టం చేస్తూనే, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.
భద్రతా పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అమెరికా ప్రభుత్వం సౌదీ అరేబియాకు ‘లెవల్-3 (Reconsider Travel)’ అడ్వైజరీని అమలు చేస్తోంది. సౌదీ నగరాలు, ప్రధాన మౌలిక సదుపాయాలు, చమురు, ఇంధన కేంద్రాలను హౌతీలు లక్ష్యంగా చేసుకునే ప్రమాదం పొంచి ఉందని, క్షిపణి శకలాలు కూలడం వల్ల కూడా ముప్పు వాటిల్లవచ్చని అమెరికా హెచ్చరించింది. మరోవైపు ఘర్షణలు తీవ్రంగా ఉన్న సౌదీ-యెమెన్ సరిహద్దు ప్రాంతాలకు ఏకంగా ‘లెవల్-4 (Do Not Travel)’ హెచ్చరికను వర్తింపజేస్తూ, అమెరికన్ పౌరులు ఎవరూ ఆ ప్రాంతాలకు వెళ్లవద్దని ఖరాకండిగా ఆదేశించింది.









