సర్వేయర్ కరువుతో .. రైతులకు భూ కష్టాలు!
భూముల హద్దులు తేల్చేదెవరు..? సర్వే చేయించుకునేదెప్పుడు..?
ప్రత్యేక సర్వేయర్‌ను వెంటనే నియమించాలి.. కలెక్టర్‌కు రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు వినతి.
సెప్టెంబర్ 21 TODAY 9
చర్ల మండలంలో సర్వేయర్ లేకపోవడంతో రైతుల భూ సమస్యలు రోజురోజుకూ పెండింగ్‌లో పడుతున్నాయని రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల హద్దుల నిర్ధారణ, సర్వేలు, భూ విభజనలు వంటి కీలక పనులకు సర్వేయర్ అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కాగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్ల మండలానికి ప్రత్యేక సర్వేయర్‌ను వెంటనే నియమించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అంకిత్‌ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. మండలంలో సర్వేయర్ లేకపోవడంతో చిన్నచిన్న భూ సమస్యల పరిష్కారం కోసం కూడా రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భూముల హద్దులు నిర్ధారించుకోవడం, సర్వేలు చేయించుకోవడం, విభజనలు తదితర పనులు సకాలంలో జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
సర్వేయర్ కొరతతో రైతుల భూ సమస్యలు పెండింగ్‌లో పడటం ఆందోళనకరమైన విషయమని, హద్దుల విషయంలో స్పష్టత లేకపోవడం భవిష్యత్‌లో భూ వివాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన పనుల కోసం ఇతర ప్రాంతాల అధికారులపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా చర్ల మండలానికే ప్రత్యేక సర్వేయర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్ అంకిత్ దృష్టికి తీసుకెళ్లగా.. సమస్యను పరిశీలించి చర్ల మండలానికి సర్వేయర్‌ను నియమించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆంజనేయులు తెలిపారు.
మండలంలో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణతో పరిష్కరించాలని ఆయన కోరారు. సర్వేయర్ నియామకంతో భూముల సర్వేలు, హద్దుల నిర్ధారణ, భూ విభజన వంటి పనులు వేగవంతమై రైతులకు ఉపశమనం కలుగుతుందని అన్నారు.
రైతుల భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో పాటు రైతుల తరఫున నిరంతరం పోరాడుతానని కొత్తపల్లి ఆంజనేయులు స్పష్టం చేశారు.
Post Views: 12









