యూకే ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం: ప్రముఖ యూట్యూబర్ నందన దంపతులపై ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు!

యునైటెడ్ కింగ్‌డమ్‌లో (యూకే) మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, నకిలీ పత్రాలతో భారీగా నిధులు దండుకున్న ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్ కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ బాధితులు హైదరాబాద్ బేగంపేటలోని జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో జరిగిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అధికారులను ఆశ్రయించారు. యూకే ప్రభుత్వమే తమ కన్సల్టెన్సీకి ఉద్యోగులను నియమించే అధికారం ఇచ్చిందని నమ్మబలికి ఈ దంపతులు దారుణంగా మోసగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానంగా స్టూడెంట్, విజిటర్ వీసాలపై యూకే వెళ్లి వీసా గడువు ముగియనున్న వారిని వీరు లక్ష్యంగా చేసుకున్నారు. వారికి పర్మినెంట్ వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి ఏకంగా రూ.95 లక్షల వరకు భారీగా నగదు వసూలు చేశారు. అయితే, ఆ కన్సల్టెన్సీ సమర్పించినవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అని తేలడంతో యూకే ప్రభుత్వం అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. దీంతో తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఏపీ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది తీవ్రంగా నష్టపోయారు.

ప్రజావాణిలో బాధితుల గోడు విన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, నోడల్ అధికారి విద్యాసాగర్, ఎన్నారై సలహా కమిటీ ఛైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. నిరుద్యోగులను మోసగించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కుంభకోణాన్ని రాష్ట్ర డీజీపీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా మరియు నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు