ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘రాకా’ విడుదల కాకముందే అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన ఆసక్తికరమైన ’37’ పోస్టర్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మేకర్స్ తాజాగా బయటపెట్టారు. ప్రపంచ చలనచిత్ర రంగంలోనే అత్యంత సంక్లిష్టమైన సాంకేతికతగా భావించే మోషన్ క్యాప్చర్ విభాగంలో ఏకంగా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ సొంతం చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల నుంచి సర్టిఫికెట్ అందుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
గతంలో 2015లో ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో 19 మందిని ఒకేసారి మోషన్ క్యాప్చర్ చేసి నెలకొల్పిన ప్రపంచ రికార్డును ‘రాకా’ టీమ్ అధిగమించింది. రియల్-టైమ్లో ఏకకాలంలో ఏకంగా 37 మంది నటీనటులు, పెర్ఫార్మర్ల కదలికలను అత్యంత కచ్చితత్వంతో మోషన్ క్యాప్చర్ చేసి చిత్ర బృందం సరికొత్త గ్లోబల్ రికార్డును లిఖించింది. హాలీవుడ్ స్థాయి అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్, భారీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టిన ఘనతగా విశ్లేషకులు దీనిని అభివర్ణిస్తున్నారు. భారతీయ సాంకేతిక నిపుణుల ప్రతిభకు ఈ రికార్డు తిరుగులేని నిదర్శనమని మేకర్స్ గర్వంగా వెల్లడించారు.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రంలో అల్లు అర్జున్ పలు విభిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన బీస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ఇందులో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్నారు. సాయి అభ్యంకార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. రికార్డు స్థాయి సాంకేతిక హంగులతో ముస్తాబవుతున్న ‘రాకా’ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలోనే ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.









