రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన: ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇళ్లు నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రాయదుర్గంలో ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. మల్కంచెరువు వెనుక భాగంలో 2.85 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ టవర్స్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో భాగంగా పలువురు అర్హులైన లబ్ధిదారులకు ఆయన ఇళ్ల కేటాయింపు పత్రాలను స్వయంగా పంపిణీ చేశారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందేంతవరకు ఈ పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించి నగరానికి సుదూర ప్రాంతాల్లో నాసిరకంగా ఇళ్లు కట్టిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఖరీదైన, నడిబొడ్డు ప్రాంతాల్లోనే పేదలకు నివాస వసతి కల్పిస్తోందని తెలిపారు. క్యూర్ (CURE) పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఇళ్లను నిర్మించి తీరుతామని, రాజకీయాలకు అతీతంగా కేవలం పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకుని పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే నెల రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఇదే క్రమంలో విచారణలో అనర్హులుగా తేలిన ఎల్3 (L3) కేటగిరీ లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభించి బేస్‌మెంట్ పూర్తి చేసుకున్న వారికి మానవతా దృక్పథంతో ప్రత్యేక అనుమతులు ఇచ్చి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అయితే, ఇళ్లు మంజూరై ఉండి ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభించని అనర్హుల అలాట్‌మెంట్లను తక్షణమే రద్దు చేస్తామని, ఆ ఖాళీలను నిజమైన నిరుపేద అర్హులతో భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు