కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో .. ఢిల్లీ కోర్టు పునర్విచారణకు ఆదేశించింది.
1983లో భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే, 1980లో సోనియా గాంధీ పేరు ఓటరు జాబితాలో చేరిందన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ కోరుతూ న్యాయవాది వికాస్ త్రిపాఠి ఫిర్యాదు చేశారు. 1982లో పేరు తొలగింపు, 1983లో తిరిగి చేర్చిన అంశాలనూ పిటిషన్లో ప్రశ్నించారు. కాగా ఇవి ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలే అని, కోర్టు నిర్ధారించిన అంశాలు కావని ఢిల్లీ కొట్టు అభిప్రాయపడింది .
అయితే ఎఫ్ఐఆర్కు ఆదేశించేందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ పాత ఉత్తర్వును ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే కొట్టివేశారు. తగిన కారణాలు లేకుండా ఉత్తర్వులు ఇచ్చారని, BNSS సెక్షన్ 175(3) ప్రక్రియను సరిగా పాటించలేదని సెషన్స్ కోర్టు గుర్తించింది.
ఇది ఇలా ఉండగా కేసును తిరిగి మెజిస్ట్రేట్ కోర్టుకు పంపిన సెషన్స్ కోర్టు.. ఫిర్యాదుదారు, సంబంధిత పోలీసు అధికారి వాదనలు విని, పోలీసుల స్టేటస్ రిపోర్టును పరిశీలించి తాజాగా కారణాలతో కూడిన నిర్ణయం ఇవ్వాలని ఆదేశించింది. ఈ దశలో సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ లేదా దర్యాప్తునకు నేరుగా ఆదేశాలు జారీ కాకపోవడం గమనార్హం .
ఈ వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 29న జరగనుంది. తాజాగా మెజిస్ట్రేట్ కోర్టు తీసుకునే నిర్ణయంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, ఇతర చట్టపరమైన ప్రక్రియ చేపట్టాలా అన్న అంశంపై స్పష్టత రానుంది.









