విలక్షణ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘అప్ప కుట్టి’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ రిలీజ్ డేట్తో కూడిన ఆసక్తికర పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ము. మారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తండ్రీకూతుళ్ల మధ్య సాగే లోతైన అనుబంధం, బలమైన భావోద్వేగాల నేపథ్యంలో పక్కా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. “గాయపడిన ముఖం.. భరోసా ఇచ్చే భుజం.. కొన్నిసార్లు ప్రేమ ఇలాగే కనిపిస్తుంది” అంటూ గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. యాక్షన్ సన్నివేశాలకు కూడా కథలో సమ ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ కేవలం కథానాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, ఎడిటర్గా కూడా స్వయంగా వ్యవహరిస్తుండటం విశేషం. ప్రీతి అస్రానీ, లితాన్య, భగవతి పెరుమాళ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తొలుత ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, తుది మెరుగుల అనంతరం దసరా పండుగ సీజన్ ముగిసిన వెంటనే అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.









