దేశంలోకి ఒక్క గ్రాము డ్రగ్స్ కూడా రానివ్వొద్దు: 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్‌ లక్ష్యం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం!

దేశ భద్రతకు, యువత భవిష్యత్తుకు పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాల (డ్రగ్స్) అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దేశంలోకి ఒక్క గ్రాము డ్రగ్స్ కూడా ప్రవేశించకుండా, అలాగే దేశం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) రాష్ట్రాల ముఖ్యుల 3వ జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన, కేవలం డ్రగ్స్ పట్టుకోవడంతో సరిపెట్టకుండా, ఈ అక్రమ రవాణాకు సంబంధించిన సమగ్ర నెట్‌వర్క్‌లను సమూలంగా కూల్చివేయడమే లక్ష్యంగా భద్రతా సంస్థలు పనిచేయాలని స్పష్టం చేశారు.

‘వికసిత్ భారత్’ సాకారంలో భాగంగా డిసెంబర్ 31, 2029 నాటికి దేశాన్ని పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా ‘విజన్ డాక్యుమెంట్ 2026-2029’ను ఖరారు చేసినట్లు అమిత్ షా ప్రకటించారు. కేవలం కిందిస్థాయి పెడ్లర్లను పట్టుకోవడానికే పరిమితం కాకుండా డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు, అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలు, డార్క్-నెట్, క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై తీవ్ర నిఘా ఉంచాలని సూచించారు. స్మగ్లర్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు పీఐటీ-ఎన్డీపీఎస్ (PIT-NDPS) చట్టం కింద వారి ఆస్తులను జప్తు చేయడంతో పాటు ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా వేగవంతమైన విచారణ జరిపించి శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేశారు.

సరిహద్దుల్లో కట్టుదిట్టమైన పహారాతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), అన్ని రాష్ట్రాల పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి ఉద్ఘాటించారు. గతంలో దేశం ఎదుర్కొన్న నక్సలిజం, ఉగ్రవాద సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లే, మాదకద్రవ్యాల ముఠాలపై కూడా రాజీలేని నిర్ణయాత్మక పోరాటం సాగిస్తామని ఆయన వెల్లడించారు. అదే సమయంలో మత్తు పదార్థాలకు బానిసలైన బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ, వారికి తగిన పునరావాసం కల్పించి సాధారణ జీవితంలోకి తీసుకొచ్చేందుకు లక్ష మంది ‘నశాముక్త్ మిత్ర’లను రంగంలోకి దించుతున్నట్లు వివరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు