అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆసక్తికరమైన, ఆప్యాయతతో కూడిన వ్యాఖ్యలు చేశారు. పరిటాల శ్రీరామ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని కొందరు అనుకుంటున్నారని, కానీ ఉదయం నిద్రలేవగానే తాను మొదటి మెసేజ్ పంపింది శ్రీరామ్కేనని ఆయన స్పష్టం చేశారు. వేదికపై మాట్లాడిన ఆయన, తాను ఉదయాన్నే వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన విషయం బయట ఉన్న వారికి తెలియకపోవచ్చని నవ్వుతూ పేర్కొన్నారు.
దివంగత నేతలు ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను స్వయంగా ఆవిష్కరించే అవకాశం తనకు దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని లోకేశ్ తెలిపారు. ఈ గొప్ప అవకాశాన్ని తనకు కల్పించిన మాజీ మంత్రి పరిటాల సునీతకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తన యువగళం పాదయాత్రతో పాటు క్లిష్ట సమయాల్లో అండగా నిలబడి, తన వెంట నడిచిన తమ్ముడు పరిటాల శ్రీరామ్ను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, తమ మధ్య అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని లోకేశ్ వివరించారు.
ఇదే సందర్భంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పార్టీ శ్రేణులు తనపై చూపిస్తున్న విపరీతమైన ప్రేమాభిమానాలను లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ధర్మవరం పర్యటనలో కార్యకర్తల ఉత్సాహం, తోపులాట వల్ల తన చేతికి అయిన గాట్లే వారి ప్రేమాభిమానాలకు నిదర్శనమని చెప్పారు. అయితే రాప్తాడులో కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో క్రమశిక్షణతో ఘన స్వాగతం పలికారని అభినందించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు.









