జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమం…

🔹 🔹 🔹జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పోస్టుకార్డు ఉద్యమం చేపడతామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రకటించారు.

జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు వెంటనే పునరుద్ధరించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ నిధికి రూ.100 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రారంభించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు ఇవ్వలేదని అల్లం నారాయణ విమర్శించారు.

గత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి రూ.42 కోట్లు కేటాయించడంతో పాటు ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల విషయంలో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

వికారాబాద్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ మాట్లాడుతూ.. కొడంగల్‌లో జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్, టీయూడబ్ల్యూజే రాజకీయాలకు అతీతంగా సబ్బండ వర్గాలను ఏకం చేస్తూ కీలకంగా పనిచేశాయని అల్లం నారాయణ గుర్తు చేశారు.

మహాసభలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై మాట్లాడగా, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రను ప్రశంసించారు.

టీయూడబ్ల్యూజే వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎం.రవీందర్, ప్రధాన కార్యదర్శిగా డి.ప్రహ్లాద్ ఎన్నికయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు