టాలీవుడ్ ప్రముఖ యువ కథానాయకుడు అల్లు శిరీష్ శబ్ద కాలుష్యం (Sound Pollution) సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను నివాసముంటున్న షేక్పేట్ పరిధిలోని అపర్ణా వన్ గేటెడ్ కమ్యూనిటీ సమీపంలో ఉన్న వినోభానగర్ హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి వేళల్లో సైతం అనుమతించిన డెసిబుల్స్కు మించి అత్యంత పెద్ద శబ్దంతో మైకులు మోగిస్తున్నారని ఆయన తన సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బహిర్గతం చేశారు. రాత్రి 2, 3 గంటల వరకు నిరంతరాయంగా పాటలు, మ్యూజిక్ వేస్తున్నారంటూ దానికి సంబంధించిన వీడియోను సాక్ష్యంగా ట్యాగ్ చేస్తూ పోలీసుల తక్షణ జోక్యాన్ని కోరారు.
ఈ విషయమై తాను ఇప్పటికే స్థానిక ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీష్ తెలిపారు. అయితే, వినాయక నిమజ్జన ఉత్సవాలు పూర్తయ్యే సెప్టెంబర్ 25 వరకు సర్దుకుపోవాలని ఆ సమయంలో అధికారులు సూచించారని చెప్పారు. కానీ పండుగలు, ఉత్సవాలు ముగిసిపోయినప్పటికీ అర్ధరాత్రి వేళల్లో ఆలయంలో భారీ శబ్దాల హోరు మాత్రం తగ్గలేదని.. ఎన్నిసార్లు వేడుకున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు రాకపోవడంతోనే విధిలేక సోషల్ మీడియా ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాల్సి వచ్చిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి వరకు సాగే ఈ మితిమీరిన శబ్ద కాలుష్యం కారణంగా తమ అపార్ట్మెంట్లోని వృద్ధులు, పసిపిల్లలు, ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే సాఫ్ట్వేర్ నిపుణులు కంటిమీద కునుకులేక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని అల్లు శిరీష్ పేర్కొన్నారు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న వారిపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









