సినిమా ఆలస్యంగా వేసి యాడ్స్ చూపించిన PVR: రూ.75 వేల భారీ జరిమానా విధించిన వినియోగదారుల కోర్టు!

సినిమా టికెట్‌పై ముద్రించిన సమయానికి షో ప్రారంభించకుండా, ప్రేక్షకుల విలువైన సమయాన్ని వ్యాపార ప్రకటనల ప్రదర్శన కోసం దుర్వినియోగం చేస్తున్న ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ సినిమాస్ (PVR Cinemas) వైఖరిపై హైదరాబాద్‌కు చెందిన ఒక న్యాయవాది చట్టపరమైన పోరాటం చేసి చారిత్రాత్మక విజయం సాధించారు. 2025లో విడుదలైన ధనుష్-నాగార్జునల ప్రతిష్టాత్మక ‘కుబేర’ సినిమాను వీక్షించేందుకు ఆయన హైదరాబాద్‌లోని పీవీఆర్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు. టికెట్‌పై రాత్రి 10:35 గంటలకు షో సమయం అని ఉన్నప్పటికీ.. నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా సుమారు 22 నిమిషాల పాటు కేవలం కమర్షియల్ యాడ్స్, రాబోయే సినిమాల ట్రైలర్లను ప్రదర్శిస్తూ సినిమాను ప్రారంభించలేదు.

షో ఆలస్యంగా మొదలవ్వడం వల్ల అర్ధరాత్రి సినిమా పూర్తయి ఇంటికి చేరుకునేసరికి దాదాపు గంటకు పైగా ఆలస్యమైందని, దీనివల్ల తాను తీవ్ర మానసిక అసౌకర్యం, ఇబ్బందులకు గురయ్యానని పేర్కొంటూ ఆ సినీ ప్రియుడు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను (Consumer Court) ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై లోతుగా విచారణ జరిపిన న్యాయస్థానం.. టికెట్ సమయానికి సినిమా ప్రారంభించకపోవడం ముమ్మాటికీ సేవా లోపమేనని (Deficiency in Service), వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రేక్షకుల సమయాన్ని ఇలా బలవంతంగా వృథా చేయడాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.

నిబంధనలు ఉల్లంఘించిన పీవీఆర్ సినిమాస్ యాజమాన్యానికి వినియోగదారుల కమిషన్ ఏకంగా రూ.75,000 జరిమానా విధించింది. ఇందులో బాధితుడికి కలిగిన అసౌకర్యానికి నష్టపరిహారంగా రూ.20,000, ఆయన కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5,000 తక్షణమే చెల్లించాలని ఆదేశించింది. మిగిలిన రూ.50,000 మొత్తాన్ని రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయాలని తీర్పునిచ్చింది. సినిమా థియేటర్లలో సమయపాలన పాటించకుండా వాణిజ్య ప్రకటనలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు