చదువుకునే పాఠాలు పుస్తకాలకే పరిమితం కాకుండా నిత్యజీవిత సమస్యలకు పరిష్కారాలు చూపాలని నిరూపించాడు చైనాకు చెందిన 14 ఏళ్ల విద్యార్థి జియా మింగ్షువాన్. ఉత్తర చైనాలోని చిఫెంగ్ నగర సమీపంలో ఎడారిని ఆనుకుని ఉండే ఆవోహన్ బ్యానర్ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా ఉండటం వల్ల పచ్చదనం పెంచడం పెను సవాలుగా మారింది. తీవ్రమైన గాలులు, పొడి వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో మొక్కలు బతకాలంటే వాటి వేర్లకు నిరంతరం తేమ అందించేందుకు ఎంతో సమయం, మానవ వనరులు అవసరమయ్యేవి. ఈ సమస్యను నిశితంగా పరిశీలించిన జియా.. ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండానే గాలిలోని తేమను ఒడిసిపట్టి నేరుగా మొక్కల వేర్లకు అందించే వినూత్న వ్యవస్థను రూపొందించాడు.
ఓ రోజు ఇంట్లో వంటగది టైల్స్పై ఆవిరి చల్లబడి నీటి బిందువులుగా మారడాన్ని గమనించిన జియాకు, పాఠశాలలో నేర్చుకున్న సాంద్రీకరణ (కండెన్సేషన్) సూత్రం గుర్తొచ్చింది. నేల ఉపరితలానికి, భూమి లోపలి భాగానికి మధ్య ఉండే ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని ఒక ప్రొటోటైప్ను సిద్ధం చేశాడు. కేవలం ఒక స్టీల్ పైపు, ప్లాస్టిక్ బాటిళ్లతో ఈ పరికరాన్ని నిర్మించాడు. పైపు పైభాగం ద్వారా లోపలికి ప్రవేశించే వెచ్చని గాలి.. భూమి లోతుల్లో ఉండే చల్లదనానికి గురై నీటి చుక్కలుగా మారుతుంది. ఆ నీటిని అడుగున అమర్చిన బాటిళ్ల ద్వారా నేరుగా మొక్కల వేర్ల భాగానికి చేరుస్తూ అత్యంత ప్రభావవంతంగా పనిచేసేలా డిజైన్ చేశాడు.
ఈ అద్భుత ఆవిష్కరణతో జియా జర్మనీలోని న్యూరెంబర్గ్లో జరిగిన ప్రతిష్టాత్మక iENA ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ జూనియర్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా 540 మందికి పైగా యువ పరిశోధకులు సర్జికల్ రోబోలు, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ వంటి అధునాతన ప్రాజెక్టులతో పోటీ పడగా.. అత్యంత తక్కువ ఖర్చుతో పర్యావరణానికి మేలు చేసే జియా ఆవిష్కరణ అంతర్జాతీయ జ్యూరీని మెప్పించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం షాంఘైకి చెందిన పరిశోధకుల బృందం ఈ ప్రాజెక్టును మరింత ఆధునీకరించి ఎడారి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అమలు చేసేందుకు కృషి చేస్తోంది.









