తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటన బాధితులకు తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రజాపాలనలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి బాధిత కుటుంబాలకు మొత్తం రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇందులో భాగంగా తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాధితులకు రూ.10 లక్షల చొప్పున, మరో ఆరుగురికి రూ.5 లక్షల చొప్పున పరిహారపు చెక్కులను ప్రభుత్వం తరఫున అందజేసి వారికి భరోసా కల్పించారు.
ఈ ఘటన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2017 జూలై 2న మధ్యమానేరు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని ఇసుక క్వారీల నుంచి వందలాది లారీలతో రవాణా సాగుతున్న సమయంలో జరిగింది. ఆ లారీల రాకపోకల వల్ల వరుస ప్రమాదాలు జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోగా, జూలై 2న నేరెళ్లకు చెందిన భూమయ్య అనే వ్యక్తి ఇసుక లారీ ఢీకొని మృతి చెందడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు దిగి ఐదు లారీలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు పోలీసులు గాయపడటంతో 13 మందిపై కేసులు నమోదు చేశారు.
అయితే ఆ కేసులో అరెస్టయిన వారిపై పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపాయి. కరీంనగర్ జైలు అధికారులు నిందితుల ఒంటిపై ఉన్న తీవ్ర గాయాలను చూసి జైలులోకి తీసుకోవడానికి నిరాకరించడం, పలువురు బాధితులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవ్వడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఆ గాయాల తాలూకు దుష్ప్రభావాలతో ఇప్పటికీ పలువురు బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండగా, తాజా సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై ధ్వజమెత్తుతూ బాధితులకు ఈ పరిహారాన్ని అందించి అండగా నిలిచారు.









